Sunday, June 18, 2006

సీతా స్వయంవరం

నా చిన్నప్పుడు తొమ్మిదవ తరగతిలో అనుకుంటాను సీతాస్వయంవరం అని ఆతుకూరి మొల్ల ప్రాసిన పద్యపాఠం ఉండేది. చక్కటి తేట తెలుగులో చిన్నచిన్న పదాలతో వ్రాసిన పద్యాలు ఇంకా గుర్తున్నాయి (అనుకుంటా!). తప్పులుంటే క్షమించి తెలియజేయండి. సరిదిద్దుకోగలవాడను.

సీత స్వయంవరమని తెలిసి వివిధ దేశ రాజకుమారులు ఎలా వచ్చారో చూడండి.

కొందఱు పల్లకీల, మఱి కొందఱు తేరుల, నందలంబులం
గొందఱు, కొంద ఱశ్వముల, గొందఱు మత్త గజేంద్ర సంఘమున
గొందఱు స్వర్ణ డోలికల, గోరిక నెక్కి నృపాల నందనుల్‌
సందడిగాగ వచ్చిరి, బుజంబు బుజంబును ద్రోపులాడగన్‌.
ఆ విధంగా వచ్చిన రాజకుమారులతో జనక మహారాజు శివ ధనస్సును ఎక్కుపెట్టిన వారికి సీతనిత్తునని ప్రకటించగా ఆ విల్లుని చూచిన రాజకుమారులు
విల్లా? యిది కొండా? యని
తల్లడపడి సంశయంబు తలకొన మదిలో
బల్లిదు లగు నృప నందను
లెల్లరు దౌదవుల నుండి రెంతయు భీతిన్‌.


కొందఱు డగ్గఱ నోడిరి,
కొందఱు సాహసము చేసి కోదండముతో
నందంద పెనగి పాఱిరి
సందుల గొందులను దూఱి, సత్వ్తము లేమిన్‌.
అనేకవిధముల ప్రయత్నించి విఫలురవ్వగా విశ్వామిత్రుని ఆజ్ఞతో శ్రీరాముడు సిద్ధమగుటను లక్ష్మణుడు ఏ విధంగా వర్ణించాడో చూడండి.
కదలకుమీ ధరాతలమ, కాశ్యపి బట్టు, ఫణీంద్ర భూ విషా
స్పదులను బట్టు, కూర్పమ రసాతల భోగి ఢులీ కులీశులన్‌
వదలక పట్టు, ఘృష్టి ధరణీ ఫణి కచ్ఛప పోత్రి వర్గమున్‌
బొదువుచు బట్టుడీ కరులు, భూవరు డీశుని చాప మెక్కిడున్‌.
లక్ష్మణుడు శ్రీరాముని "భూవరుని"గా వర్ణిస్తూ శివధనుస్సు నెక్కుపెట్టడం ఒక్క శ్రీరామునికే సాధ్యమని ప్రకటించేశాడు మఱి... అప్పుడు...
ఇన వంశోద్భవుఁడైన రాఘవుడు, భూమీశాత్మజుల్‌ వేడ్కతో
దను వీక్షింప, మునీశ్వరుం డలర, గోదండంబు చే నంది, చి
వ్వన మోపెట్టి, గుణంబు పట్టి, పటు బాహా శక్తితో దీసినన్‌,
దునిగెన్‌ జాపము భూరి ఘోషమున, వార్ధుల్‌ మ్రోయుచందంబునన్‌.
ఆ దృశ్యమును చూచిన రాజకుమారులు, సీత, జనకుడి స్థితిని మొల్ల ఎలా చెప్పిందో చూడండి.
ధనువు దునిమినంత ధరణీశ సూనులు
శిరము లెల్ల వంచి సిగ్గు పడిరి,
సీత మేను వంచె, శ్రీరామచంద్రుని
బొగడె నపుడు జనక భూవిభుండు.

తెలుగులో వినిపించే కవయిత్రులలో మొల్ల అగ్రగణ్యురాలు. అసలు ఏకైక తెలుగు కవయిత్రిగానే ఎక్కువమందికి తెలుసు. కావ్యాలు వ్రాసిన మరో కవయిత్రి పేరు చెప్పండి చూద్దాం? ఏమయినా మొల్ల రచనలు తేలిక తెలుగులో ఒలచిన అరటి పండులాంటివే...

సరే తెలుగు కవయిత్రుల చిట్టా ఇదిగో....

1) తాళ్ళపాక తిమ్మక్క- తాళ్ళపాక అన్నమాచార్యుల భార్య, తెలుగులో తొట్టతొలి కవయిత్రి. "సుభద్రాకళ్యాణం" రచయిత.
2) గంగా దేవి- కాకతీయుల ఆడబిడ్డ, విజయనగర సామ్రాజ్య స్థాపకుల్లో ఒకరైన బుక్కరాయలు మూడవకుమారుని భార్య. ఆమె "మధుర విజయము" ను వ్రాసెను.
3) ఆతుకూరి మొల్ల- జన్మతః కుమ్మరి. మొల్ల రామాయణం లోనివే పై పద్యాలు.
4) తిరుమలాంబ- వరబాంబికా పరిణయం అని సంస్కృతకావ్య రచయిత.
5) మధురవాణి- అసలు పేరు శుకవాణి. రఘునాథ తెలుగు రామాయణాన్ని సంస్కృతంలోకి అనువదించినదీమె.
6) రంగాజమ్మ-
7) ముద్దుపళని- మరాఠరాజు ఆస్థాన కవయిత్రి. ఆమె వ్రాసిన "రాధికా స్వాంతనం" చదివితే శృంగారం గురించి మగవారికంటే ఆడవారే బాగా వర్ణించగలరని నమ్మకతప్పదు.
8) త్రివేణి- సంస్కృతంలో చాలా గ్రంథాలను వ్రాసెను.
9) లీలావతి- లీలావతి గణితం ఆమె వ్రాసినదే. భారతదేశపు అతిగొప్ప గణిత శాస్త్రజ్ఞులలో ఒకరైన భాస్కరాచార్యుని కుమార్తె.
10) తరిగొండ వేంకటాంబ.- బాల్య వివాహ విషసంస్కృతికి బాలవితంతువుగా మిగిలిన ఆమె అనేక భక్తి, ఆధ్యాత్మిక గ్రంథాలను వ్రాసిరి.

ఇంకా 19 వ శతాబ్దం వరకు సుమారు 20-30 మంది చెప్పుకోదగ్గ తెలుగు కవయిత్రున్నారు. ఇక నేటివరకూ అయితే 100 దాటవచ్చేమో..

Saturday, June 17, 2006

జూన్ 17.....

జూన్ 17, నేను నా మొదటి బ్లాగు వ్రాయటం మొదలు పెట్టిన రోజు.

అయితే అదే రోజు భారతదేశ చరిత్రలో చాలా ప్రాముఖ్యం గల రోజని బహుశా ఎక్కువ మందికి తెలియదు. దాదాపు నూటయాభై సంవత్సరాల నాటి చరిత్ర ఇది. తెల్లదొరల అన్యాయపు, దుర్మార్గపు పాలనలోని భారత సైనికులు తమతమ మత స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు సైతం ఫణంగా పెట్టి తిరుగుబాటులు లేవదీసిన రోజులవి. ఆ సమయంలో చిక్కిన సైనికులకు ఎలా మరణశిక్ష అమలుచేసే విధానాన్ని Vassili Verestchagin అనే రష్యన్ చిత్రకారుని బొమ్మ ఇది.


బారులు తీరిన ఫిరంగులు. వాటికి కదలకుండా, వీపు తుపాకీ గొట్టానికి ఆనించి కట్టివేయబడిన అభాగ్యులు. కొద్దిసేపట్లో అన్ని ఫిరంగులూ ఢామ్మని ఒకేసారి ప్రేలుతాయి. ఆపై గుండు దెబ్బకి ఛిద్రమై ప్రాణాలు విడిచిన శరీరాలను తీసి ఆవల పారవేసి మరొక వీరుని కట్టివేసే సైనికులు.

ఇటువంటి శిక్షలు ఏ ఒక్కరికో ఇద్దరికో వేయలేదు. ముర్దాన్ లోని 51వ పటాలంలోని మొత్తం 700 మందికీ ఇదే శిక్ష. అలహాబాద్ లో సుమారు 2000 మంది. ఇంకా ఇలా ఎన్ని వందలో, వేలో.


అటువంటి 1857-1858 సంవత్సరాల కాలంలో లార్డ్ డల్హౌసీ ప్రవేశపెట్టిన Doctrine of Lapse వల్ల రాజ్యాలు కోల్పోయిన భారత సంస్థానాధీశులు తెల్లదొరలపై, ఈస్ట్ ఇండియా కంపెనీపై స్వాతంత్ర్యం కోసం యుద్ధం ప్రారంభమయినప్పుడు కన్నబిడ్డ, కట్టుకున్న భర్త మరణించిననూ దత్తబిడ్డను వీపుకు కట్టుకొని కత్తిబట్టుకొని యుద్ధరంగంలో తొలివిజయాన్ని సాధించి భారతీయులందరికీ ఆదర్శప్రాయంగా, స్ఫూర్తినిస్తూ 27 సంవత్సరాల ప్రాయంలో మరోయుద్ధంలో, సైన్యంకంటే ముందుగా యుద్ధరంగంలోకి చొచ్చుకుపోతూ శత్రువు వెనకనుండి తీసిన దెబ్బకు దెబ్బతిని ఝాన్సీ రాణి లక్ష్మీబాయి (చిన్ననాటి పేరు మణికర్ణిక )మరణించిన రోజు 1848 జూన్ 17 అని ఎందరు భారతీయులకు తెలుసు? Valentine's Day, Father's Day, Mother's day అంటూ లెక్కకు మిక్కిలిగా జరుపుకొనే భారతీయులకు ఆనాటి స్వాతంత్రసమరయోధులను, వారి ధనమానప్రాణత్యాగాలను గుర్తించుకుని స్మరించుకునే కనీస బాధ్యత కూడా లేనట్టున్నది.