Saturday, June 17, 2006

జూన్ 17.....

జూన్ 17, నేను నా మొదటి బ్లాగు వ్రాయటం మొదలు పెట్టిన రోజు.

అయితే అదే రోజు భారతదేశ చరిత్రలో చాలా ప్రాముఖ్యం గల రోజని బహుశా ఎక్కువ మందికి తెలియదు. దాదాపు నూటయాభై సంవత్సరాల నాటి చరిత్ర ఇది. తెల్లదొరల అన్యాయపు, దుర్మార్గపు పాలనలోని భారత సైనికులు తమతమ మత స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు సైతం ఫణంగా పెట్టి తిరుగుబాటులు లేవదీసిన రోజులవి. ఆ సమయంలో చిక్కిన సైనికులకు ఎలా మరణశిక్ష అమలుచేసే విధానాన్ని Vassili Verestchagin అనే రష్యన్ చిత్రకారుని బొమ్మ ఇది.


బారులు తీరిన ఫిరంగులు. వాటికి కదలకుండా, వీపు తుపాకీ గొట్టానికి ఆనించి కట్టివేయబడిన అభాగ్యులు. కొద్దిసేపట్లో అన్ని ఫిరంగులూ ఢామ్మని ఒకేసారి ప్రేలుతాయి. ఆపై గుండు దెబ్బకి ఛిద్రమై ప్రాణాలు విడిచిన శరీరాలను తీసి ఆవల పారవేసి మరొక వీరుని కట్టివేసే సైనికులు.

ఇటువంటి శిక్షలు ఏ ఒక్కరికో ఇద్దరికో వేయలేదు. ముర్దాన్ లోని 51వ పటాలంలోని మొత్తం 700 మందికీ ఇదే శిక్ష. అలహాబాద్ లో సుమారు 2000 మంది. ఇంకా ఇలా ఎన్ని వందలో, వేలో.


అటువంటి 1857-1858 సంవత్సరాల కాలంలో లార్డ్ డల్హౌసీ ప్రవేశపెట్టిన Doctrine of Lapse వల్ల రాజ్యాలు కోల్పోయిన భారత సంస్థానాధీశులు తెల్లదొరలపై, ఈస్ట్ ఇండియా కంపెనీపై స్వాతంత్ర్యం కోసం యుద్ధం ప్రారంభమయినప్పుడు కన్నబిడ్డ, కట్టుకున్న భర్త మరణించిననూ దత్తబిడ్డను వీపుకు కట్టుకొని కత్తిబట్టుకొని యుద్ధరంగంలో తొలివిజయాన్ని సాధించి భారతీయులందరికీ ఆదర్శప్రాయంగా, స్ఫూర్తినిస్తూ 27 సంవత్సరాల ప్రాయంలో మరోయుద్ధంలో, సైన్యంకంటే ముందుగా యుద్ధరంగంలోకి చొచ్చుకుపోతూ శత్రువు వెనకనుండి తీసిన దెబ్బకు దెబ్బతిని ఝాన్సీ రాణి లక్ష్మీబాయి (చిన్ననాటి పేరు మణికర్ణిక )మరణించిన రోజు 1848 జూన్ 17 అని ఎందరు భారతీయులకు తెలుసు? Valentine's Day, Father's Day, Mother's day అంటూ లెక్కకు మిక్కిలిగా జరుపుకొనే భారతీయులకు ఆనాటి స్వాతంత్రసమరయోధులను, వారి ధనమానప్రాణత్యాగాలను గుర్తించుకుని స్మరించుకునే కనీస బాధ్యత కూడా లేనట్టున్నది.

No comments: